తనుమధ్యా స్తబకం

  1. ధ్వాంతం పరిహర్తుం తేజాంస్యపి భర్తుం !
    అంతర్మమ భూయా త్స్మేరేంద్ర పురంధ్రీ II

    చీకటిని పరిహరించుటకు, తేజస్సును నింపుటకు ప్రకాశించు ఇంద్రాణి నా హృదయమందుండుగాక.
  1. భీతా మరిధూతా మార్యావని మేతాం ।
    సమ్రాజ్ఞి బుధానాం దూనా మవ దీనాం ॥

    ఓ పండిత పరిపాలినీ ! భీతిజెంది, శత్రువుల యధీనమై, కంపించు దీనురాలైన ఈ యార్యావర్తమును రక్షింపుము.
  1. ఇంద్రస్యసహాయాం విశ్వస్య విధానే
    ఆకాశ శరీరా మంబాం ప్రణమామః ॥

    విశ్వసృష్ణియం దింద్రునకు సహాయురాలవై, యాకాశ శరీర ముగల అంబవైన నీకు మేము నమస్కరింతుము
  1. కర్తుర్భువనానాం మాయాసి శచి త్వం !
    సత్యస్య తపో౽సి జ్ఞస్యాసి మనీషా

    ఓ శచీ ! నీవు భువనకర్తకు మాయవైతివి, సద్వస్తువునకు తపస్సు వైతివి, పండితులకు బుద్ధివైతివి.
  1. ఆజ్ఞా౽సి వినేతు స్తేజో౽సి విభాతః ।
    నిర్యత్న సమా ధే రానంద రసో౽సి ॥

    ఈశ్వరునకు నీవతని యాజ్ఞవైతివి, అగ్నికి తేజస్సువైతివి,నిర్వికల్ప సమాధియందుండు యోగికానందరసమైతివి.
  1. తస్య త్వమనన్యా౽ వ్యన్యేవ ఖకాయా ।
    అత్యద్భుతమాయా జాయా౽సి సహాయా I

    అనన్యురాలవైనను, అన్యురాలవలె నాకాశ శరీరముతో నత్యద్భుత మాయారూపిణివై, నీ వతనికి సహాయ మొనర్చు భార్య వైతివి.
  1. ఆకాశ శరీరాం జాయామశరీరః ।
    ఆలింగ్య విభుస్త్వాం నందత్యయి చిత్రం ॥

    దేవీ ! అశరీరుడైన ప్రభువు ఆకాశ శరీరముచే భార్యవగు నిన్నా లింగనము చేసికొని యానందించున్నాడు. ఇదియే చిత్రము. (నందతి ధాతువునుండి వచ్చిన ‘ఆనంద’ పదమునకు సమృద్ధిమంత మర్ధమగును, సంతోషమనికాదు. ఆకాశ శరీర మునకు వస్తుసమృద్ధినిచ్చువా డానందస్వరూపుడు. అతని స్వరూపమందొక అంశమాత్ర మా కాశము. దాని నావరించి స్వరూపముండుట ఆలింగనమగును.
  1. వజ్రేశ్వరి ఘస్రే శీర్షేంబ బిభర్షి ।
    దీప్తం సవితారం మాణిక్య కిరీటం II

    ఓ యంబా ! పగటిపూట ప్రజ్వలించుచున్న సూర్యుని నీవు మాణిక్య కిరీటమువలె ధరించు చుంటివి.

(ఆకాశ రూపిణియెక్క వైభవమిది. శక్తికి రెండు రూపములు వచింపబడుచున్నవి. అందొకటి యాకాశరూపమై కిరీటమును ధరించి విశ్వపాలన మొనర్చు ప్రభ్వీరూపము ఇంకొకటి దివ్య స్త్రీ రూపము. రెండవది దిగువ 13, 14 శ్లోకములచే చెప్పబడుచున్నది)

  1. నక్షత్ర సహస్రై శ్శుభ్రద్యుతిభి స్తే ।
    పుష్పాయితమేతై ర్మాతర్నిశి మస్తే ॥

    తల్లీ ! తెల్లని కాంతిగల యీ నక్షత్రసమూహములే రాత్రిభాగ మున నీ శిరస్సునందు పుష్పములవలె నున్నవి.
  1. ఘస్రః ఖలుకాలో రాజ్యం శచి కర్తుం ।
    రాత్రిః ఖలుకాలో రంతుం రమణేన ॥

    ఓ శచీ ! రాజ్యమును పాలించు కాలము పగ లేగదా ! భర్తతో రతిసల్పు కాలము రాత్రియేకదా ! ( మొదటి దాకాశరూపమునకు, రెండవది స్త్రీ రూపమునకు జెందును.)
  1. నిశ్శబ్ద తరంగా స్వగ్లౌషు నిశాసు ।
    నూనం ఖశరీరే కాంతం రమయంతీ !

    ఓ యాకాశ శరీరిణీ ! చంద్రుడు లేనట్టి, నిశ్శబ్ద తరంగములు గలిగినట్టి చీకటి రాత్రులందు నీవు భర్తను రమింపజేయు చుంటివి. నిశ్చయము.
  1. సాంద్రోడు సుమస్ర ద్విభ్రాజిత కేశా ।
    ధ్వాంతాసిత చేలా శాంతా౽ప్యసి భీమా ॥

    ఓ దేవీ ! దట్టమైన నక్షత్రములనెడి పూలదండలతో విభ్రాజమానమగు కేశములున్ను, చీకటియను నల్లని వస్త్రమున్ను గలిగి నీవు శాంతముగా నున్నను భయంకరముగా నుంటివి.
  1. రాజ న్మితతారా మందార వతంసాం ।
    మాత స్సితభాసా స్మేరాం హసితేన ||

    ఓ మాతా ! జ్యోతిర్మయమైన నక్షత్రముల నెడి మందారపుష్పములచే నలంకృతమైనట్టిన్ని, తెల్లని కాంతిగల నవ్వుచే శోభించు చున్నట్టిన్ని,
  1. జ్యోత్స్నా ఘనసార ద్రావై రనులిప్తాం ।
    త్వాం వీక్ష్య న శాంతిః కస్య క్షణదాసు ।|

    వెన్నెల యను కర్పూర రసముచే లేపన జేయబడినట్టిన్ని నిన్ను రాత్రి భాగములందు జూచిన వారికెవరికి శాంతి గలుగకుండును?
  1. బాలారుణ రోచిః కాశ్మీర రజోభిః ।
    ఆలిప్తముఖీం త్వాం ప్రాతః ప్రణమామి ॥

    బాలసూర్యుని కిరణముల నెడి కుంకుమ ధూళిచే లేపనగావింపబడిన ముఖముగల నిన్ను నేను ప్రాతఃకాలమున నమస్కరింతును.
  1. సాయంసమయ శ్రీ లాక్షారస ర క్తం ।
    ప్రత్య క్ప్రసృతం తే వందే వర దేంఘ్రిం !!

    ఓ దేవీ ! సాయంసమయ కాంతియ నెడి లత్తుకచే నెట్టబడిపశ్చిమమున వేఱుగా వ్యాపించిన నీ పాదమునకు నేను నమస్క- రింతును.
  1. దీప్తార్క కిరీటాం సర్వాన్వినయంతీం ।
    వందే భువనానాం రాజ్ఞీమసమానాం ॥

    ప్రకాశించు సూర్యుని కిరీటముగా గొని సకలజనులను శాసించునట్టి, భువనములకు ప్రభ్వివై నిరుపమానవైనట్టి నిన్ను నేను కొలుతును.
  1. ధూతాఖిల రోగా శ్శ్వాసాస్తవ వాతాః ।
    మాతర్వితరంతు ప్రాణస్య బలం నః ॥

    ఓ తల్లీ ! సకలరోగనివారణమగు నీ శ్వాస మా ప్రాణములకు బలమిచ్చుగాక.
  1. ప్రాంచ స్తవ వాతా శ్శ్వాసా శ్శముశంతు ।
    ప్రత్యంచ ఇమే నః పాపం శమయంతు ॥

    ఓ తల్లీ ! వెలుపలకు వచ్చు నీ శ్వాస మాకు సౌఖ్యము నిచ్చుగాక. లోనికి బోవు నీ శ్వాస మా పాపములను నశింపజేయుగాక.
  1. మన్మాత రవాంచో వీర్యం వితరంతు |
    సంతాప ముదంచ స్సర్వంచ హరంతు ॥

    తల్లీ ! దక్షిణముగా వచ్చు నీ శ్వాసవాయువులు మాకు వీర్యమునిచ్చుగాక. ఉత్తర దిక్కుగా వచ్చు శ్వాస మా సకల సంతా పములను హరించుగాక.
  1. అస్యా ఇవ భూమే ర్భూత ప్రసవాయాః ।
    ఏకైకశ ఆహుర్యేషాం మహిమానం ॥

    భూతములకు తల్లియైన భూమి యొక్క మహిమను బూర్తిగాచెప్పలేనట్లే, యే గోళమహిమను గురించియైన నొక్కొక్క భాగముకంటే హెచ్చుగా చెప్పజాలకుండిరి.
  1. అద్రే రుపలానాం నద్యాస్సిక తానాం !
    యేషాంచ న కశ్చి చ్ఛక్తో గణనాయాం ॥

    కొండలయొక్క తాళ్ల సంఖ్య, నదుల యొక్క యిసుక (తిన్నెల) సంఖ్య చెప్పజాలనట్లే, గోళముల సంఖ్యయు చెప్పశక్యము కాదు.
  1. రోమాయిత మేత్రే ర్గోళైస్తవకాయే ।
    వ్యాఖ్యాత మనేన శ్లాఘ్యం తవ భాగ్యం

    ఓ దేవీ ! ఇట్టి యసంఖ్యాకమైన గోళము లే నీ శరీరమందు రోమములు (అల్పాంశలు). ఇంతమాత్రముచేతనే కొనియాడ దగియున్న నీ భాగ్యము వ్యాఖ్యానమయ్యెను.
  1. విశ్వం వహసీదం జంభారి భుజస్థా ।
    ఆర్యాన్వహ మాత ర్వాసిష్ఠమతిస్థా

    ఓ తల్లీ! దేవేంద్రుని భుజములందు నీవుండి విశ్వమును వహించుచుంటివి. వాసిష్ఠుని (గణపతిముని) బుద్ధియందు నీవుండి ఆర్యులను వహింపుము.
  1. ఆద్యాం భువనానాం భర్తు స్తనుమధ్యాం
    భక్తస్య భజంతా మేతా స్తనుమధ్యాః ॥

    భువనములకు పూర్వమే యున్న శక్తిని, యీశ్వరుని తను మధ్యను (భార్యను, ఇంకొక అర్ధము శరీరమధ్యమందుండు నాకాశరూపిణిని) భక్తునియొక్క యీ తనుమధ్యావృత్తములు పొందుగాక.