రేణుకాగీతము

సుర శిరశ్చరః-చరణ రేణుకా ।
జగదధీశ్వరీ-జయతి రేణుకా ॥ 1 ॥

దేవతల శిరస్సులపై చరించు పాదధూళిగల జగదీశ్వరియగు రేణుక ప్రకాశించు గాక.
దేవతా శిరో-దేశ లాలితమ్ ।
రేణుకా పదం దిశతు మే ముదమ్ ॥ 2 ॥

దేవతా శిరోప్రదేశములందు లాలింపబడు రేణుక పాదము నాకు సంతోషము నిచ్చుగాక.
కుణ్డలీపురీ-మణ్డనం మహః ।
కిమపి-భాసతాం మమ సదా హృది ॥ 3 ॥

కుండలీపురమున కలంకారమగు నొకానొక తేజస్సు నా హృదయమందెల్లప్పుడు ప్రకాశించుగాక. (ఉత్తరార్కాటు జిల్లాలో పడైవీడను గ్రామమునకు చెంది రేణుకా క్షేత్రమున్నది. అక్కడ ఉత్తరవాహినియై ప్రవహించునదీ ప్రవాహ మాక్షేత్రమందే జమదగ్ని యాగస్థలమున జనించుచు కుండలినీ నది యని ప్రసిద్ధమైయున్న క్షేత్రము కుండలీపురమనబడెను)
మస్తకైతవం-వస్తు శాశ్వతమ్ ।
అస్తి మే సదా-శస్తదం హృది ॥ 4 ॥

శిరస్సు నెపముగా గలది (అనగా అలంకారమునకు మాత్రము విగ్రహమునకు శిరస్సునమర్తురు కాని యామె నిజమునకు కృత్తశిరస్సురాలై వెలిపెను), శాశ్వతమైనది, ప్రశస్తమైనది యగు ఆ దివ్యవస్తువు నా హృదయమందు సదా స్ఫురించుగాక. (అనగా శిరస్సు మండి నిర్విషయమైన హృదయతేజస్తత్యము నీ రేణుక నిరూపించునని భావము)
ఆదినారి తే పాదపఙ్కజమ్ ।
స్ఫురతు మే మనః సరసిజే సదా ॥ 5 ॥

ఓ ఆదిమ నారీ! నీ పాదపద్మము నా మనః పద్మమందు సదా స్ఫురించుగాక!
కేవలం పదో సేవకోఽస్మి తే ।
వేద్మి నేతరద్వేద సన్నుతే ॥ 6 ॥

ఓ వేదసన్నుతా! నీ పాదములందు కేవలం సేవకుడవై నేనుంటిని. నేనితరమైనదాని నెఱుగను
హృదయ తేణునః సముచితోఽణునా ।
పరిచయోఽమ్బికా పాదరేణునా ॥ 7 ॥

ఓ హృదయమా! అణురూపమైయున్న (అల్పమైయున్న) నీకు అణువైన (సూక్ష్మమైన) పాదరేణువుతో అంబిక యొక్క పరిచయము ఉచితము.
పాహి ముఞ్చ వా పాదపఙ్కజమ్ ।
త్రిదశ సన్నుతే న త్యజామి తే ॥ 8 ॥

దేవతలకు స్తుత్యమానమైన ఓ దేవీ! నన్ను రక్షించినను సరే, విడిచినను సరే. నీ పాదపద్మమమును మాత్రము నేను విడువను.
చరణమమ్బ తే యో నిషేవతే ।
పునరయం కుచౌ ధయతి కిం కృతీ ! ॥ 9 ॥

ఓ అంబా! నీ పాదమును ఎవడు సేవించునో, అట్టి ధన్యాత్ముడు తిరుగ కుచపానము చేయునా? (అనగా తిరుగ జన్మ యుండదని భావము)
అహరహోఽమ్బ తే రహసి చిన్తయా ।
ధన్యతాం గతో నాన్యదర్థయే ॥ 10 ॥

ఓ యంబా! నేను రహస్యముగా ప్రతిదినము నీ చింతన వలన ధన్యత జెందితిని. మఱియొకటి నేనర్దించను.
స్మరజితో యథా శిరసి జాహ్నవీ ।
జనని రేణుకే మనసి తే కృపా ॥ 11 ॥

ఓ రేణుకామతల్లీ! శివుని శిరస్సునందు గంగ యెట్లు నర్తించుచున్నదో, నీ మనస్సునందు కృప యట్లు నర్తించుచున్నది.

అమ్బ పాహి మాం దమ్బ తాపసి ।
పాదపఙ్కజయోః ఆదికిఙ్కరమ్ ॥ 12 ॥

ఓ యంబా! నీ పాదపద్మమందాది సేవకుడవైన నన్ను రక్షింపుము

పుత్రమాత్మనః పుణ్యకీర్తనే ।
బహుకృపే కుతో మాముపేక్షసే ॥ 13 ॥

బహువిధములైన ఓ కృపామయీ! నీ యాత్మపుత్రుడనగు నన్నేల యుపేక్షించు చుంటివి?
అమ్బ సంస్తుతే జమ్భవైరిణా ।
పాహి మామిమం మగ్నమాపది ॥ 14 ॥

ఇంద్రునితో స్తుతింపబడిన ఓ యంబా! ఆపదలో మునిగియున్న యీ నన్ను రక్షింపుము
త్వామజే విన్దుః సత్స్వరూపిణీమ్ ।
త్వాం ప్రచక్షతే సదయవీక్షితే ॥ 15 ॥

ఓ పుట్టుక లేనిదావా! సత్యశాలినీ తత్త్వవాదులు నిన్ను సాత్విక రూపిణిగా దెలియుచున్నారు
త్వాం ప్రచక్షతే సదయ వీక్షితే ।
వేది వేదినో మోదరూపిణీమ్ ॥ 16 ॥

ఓ దయార్ద్ర దృష్టిగలదానా! వేదవిదులు విమృ మోద రూపిణిగా చెప్పుచున్నారు
సంవిదం విదుస్త్వామిదం ప్రభుమ్ |
పరమయోగినః పరమదేవతే ॥ 17 ॥

ఓ పరాదేవీ! గొప్ప యోగులు నిన్నిచ్చట (అవగా శరీరమందు) పుట్టు సంవిత్తుగా తెలియుచుండిరి.

జనని కుణ్డలీపుర నివాసిని ।
పరశురామవత్పశ్య మామిమమ్ ॥ 18 ॥

కుండలీపురవాసినివగు ఓ తల్లీ ఈ నన్ను పరశురాముని వలె చూడుము.

తనయరోదనం శ్రవణశాలిని ।
శ‍ృణుసురార్చితే యది దయా హృది ॥ 19 ॥

ఓ శ్రవణశాలినీ! నీ హృదయమందు దయ యున్నచో కుమారుని రోదనము విమము.

యాచకః సుతో భజనమీప్సితమ్ ।
తదపిదుర్లభం కిమిదమమ్బికే ॥ 20 ॥

ఓ అంబికా! నీ ఈ సుతుడిష్టమైన భజనమే యాచించుచున్నాడు. అదియు దుర్లభమయ్యెము. ఇదియేమి?

మాస్తు వేతనం ఛిన్నమస్తకే ।
భజనమేవ తే యాచ్యతే మయా ॥ 21 ॥

ఓ ఛిన్నమస్తా! నాకు జీతము వలదు. నేను నీ భజనమును మాత్రము. యాచింతును.

తరలతారయా జ్వలనదీర్ఘయా ।
సానుకమ్పయా శీతపాతయా ॥ 22 ॥

కేవలం దృశాం పశ్య రేణుకే ।
తేన మే శుభం న చ తవాశుభమ్ ॥ 23 ॥

ఓ రేణుకా! చలించు కనుపాపముగలిగి పద్మమువలె దీర్ఘమైనట్టి, దయతోగూడినట్టి, చల్లని ప్రసారము గలగినట్టి దృష్టిచేతనే కేవలము నన్ను వీక్షింపుము. అట్లు చేయుటలన నీ కశుభముండదు, నాకు శుభము కలుగును.

కిఙ్కరీభవత్సురవిలాసినీ ।
జయతి కుణ్డలీ నగరవాసినీ ॥ 24 ॥

దేవతా స్త్రీలు దాసీజనముగా గల కుండలీనగరవాసిని ప్రకాశించుచున్నది.

మధురమమ్బ తే చరణపఙ్కజమ్ ।
తత్ర యద్రతైస్త్యజ్యతేఽఖిలమ్ ॥

ఓ తల్లీ! ఆ నీ చరణపద్మమం దాసక్తి గలవారిచే ఏకారణము వలన నఖిలము విడువబడుచున్నదో, ఆ కారణము చేతనే యది మధురమైన దగుచున్నది.

చరణమమ్బ తే చరతు మే హృది ।
ఇయమనామయే ప్రార్థనా మమ ॥

ఓ యంబా! (అట్టి) నీ చరణము నా హృదయమందు సంచరించుగాక, ఇదియే నా ప్రార్థన.

భుజగకఙ్కణప్రభూతి సంస్తుతే ।
భుజభువామరేర్జనని పాహిమామ్ ॥

బ్రహ్మభుజములనుండి పుట్టిన క్షత్రియులకు వైరియైన పరశురామునకు తల్లివైన ఓ దేవీ! నన్ను కాపాడుము.

కుణ్డలీపురీ మణ్డనాయితా ।
గణపతిస్తుతా జయతి రేణుకా ॥

గణపతి ముని చే స్తుతింపబడిన ఓ కుణ్డలీపుర అధిష్ఠాత్రీ ! రేణుకా దేవి ! నీకు జయము !!

ఇతి శ్రీ వసిష్ఠ గణపతిముని ప్రోక్తం రేణుకా గీతమ్ సమ్పూర్ణమ్ ॥