వేడికోలు

గ్రహదోషంబుల బాపుచు
నిహపరముల సుఖమునిచ్చు నీదగు నామం
బహరహమున జపియించుచు
నిహముననే ముక్తి గాంతు నీశాన! శివా॥ 41 ॥
అడుగను మడిమాన్యంబుల
నడుగను సంపదల నిన్ను నరేందుధరా!
అడుగను నిన్నిలనేమియు
అడిగిన సాయుజ్యమిమ్ముమార్ధాంగ! శివా!॥ 42॥

అక్షరలక్షలమించిన
యక్షరములనిచ్చితయ్య యక్షయ్యముగా.
అక్షత భాగ్యము నాకవి
దక్షములై నిన్నుఁ జేర్చు దక్షేశ! శివా! ॥ 43 ॥

భోగంబుల నాశింపను
యాగంబుల సేయనయ్య యర్చావిధులన్
త్యాగంబుగ నే చేసెద
రాగాంబుధి ముంచకయ్య రతిసేవ్య శివా! | 44 ।

భువి భోగంబులు క్షణికము
లవి బుద్భుదములకరణిని నంతంబందున్
అవి నాకెందులకయ్యా !
ధవళంబగు ముక్తి నాకు దయచేయు శివా! ॥ 45 ॥

హర! హర! శంభో! యనగను
హరియింతువు పాతకముల నంతకహన్తా
హరనామ మంత్రజపమే
మరువక నే జేయునట్లు మతినిమ్ము శివా! ॥ 46 ॥

నేనే జన్మమునెత్తిన
నా నీదగు పాదభక్తి నందీయుమయా
దానను ముక్తిని పొందెద
నేనేమియుఁ గోరనయ్య నిజమిదియ శివా! ॥47 ॥

నిన్నెప్పుడుఁ గనునట్లుగ
కన్నీయుము తండ్రి నాకుఁ గారుణ్యముతో
కన్నది నిజమైనదిగా
మిన్నగ నేనెంతునయ్య మేనునను శివా! ॥ 48 ॥

ఎంగిలి మాంసము నీకే
భంగిని రుచియించెఁ జెప్పు భవ! పరమేశా!
వంగిన భక్తుల కీవే
వంగుదు వౌరౌర కరుణ వరదాఢ్య శివా! ॥ 49

తినుమని యెంగిలి పెట్టను
తనువిమ్మని యడుగనయ్య తమకము తోడన్
కనరమ్మని నిన్నడుగను
మనమున విశ్రాంతి గొనుము మాలింగ! శివా! ॥50

ఱాలను రువ్వఁ జాలను
జాలను నే మొత్త నిన్ను జడమగు వింటన్
బేలగ నేమియునడుగను
హేలగ నాదం నీకు నిచ్చెదను శివా! ॥51॥

చన్నుగ నిన్నొకడెన్నెను
మిన్నగ తలపైన కొప్పు మీదట నొకడున్
నిన్నెన్నజాలరైరిగ
వెన్నుండును బ్రహ్మకూడ వేసారి శివా! ॥ 52 ॥

కూటికి నీచుల సేవల
నేటికి నియమించెదయ్య ఈశా! నీదా
చాటున బ్రతుకగనిమ్మా
దీటుగ పాదమ్మునిమ్ము తిరముగను శివా! ॥ 53॥

ఆదిమ భిక్షుడవీవుగ
నాదగు బిచ్చమ్ము గొనుము నామానసమున్
మీదుగఁ గట్టితి నీకై
నాదేమియుఁగానరాక నగధన్వ! శివా! ॥54 ॥

ఇచ్చెను కన్నుల నొక్కం
డిచ్చెను తలకాయలన్ని ఈశుడవంచున్
ఇచ్చెద చిత్తము నేనును
మెచ్చుము నన్వారి సాటి మేలగును శివా! ॥ 55 ॥

భవునిగ సృష్టినిఁ జేయుదు
వవనము మృడనామధేయమందియు నహహా
భవమును హర నామంబున
చివరకు మరి సంహరింతు సిద్ధమిది శివా! ॥ 56

బంధువులందరుఁ గూడను
బంధంబులు జగతిలోన భావింపంగా
బంధములు నావి త్రైళ్లగ
బంధింపుము భక్తితోడ భయహారి! శివా! ॥57 ।

నావని యనుచునుఁ బిమ్మట
నావారలు ననుచు జగతి నా నా యనుచున్
నావాడవనక నిన్నును
నే విడిచిన విడువఁబోకు నీతోడు శివా! ॥58 ॥

ఘోరంబగు నీజగమున
యారాటంబందుచున్న యర్బకు నన్నున్
జేరంగ దీసికొనుమా
రారా నీకేల భయము రమ్మనుచు శివా! ॥59॥

నిన్నడుగను నీ భుక్తిని
నిన్నడుగను వాహనంబు నీవగు భూషల్
నిన్నడుగను నీ వృత్తిని
నిన్నడిగెదనయ్య తోడు నీవుండ శివా! ॥60 ॥

సాలీడు పామునేనుఁగు
నీ లీలన పొందెఁ గాదె నీ సాయుజ్యం
బాలాగు నన్నుఁ గావుము
హేలాగతి మోక్షమీయనీశుడవు శివా! ॥ 61 ॥

మాకోరికలనుఁ దీర్పగ
మా కెందుకు కల్పవృక్ష మట్లె సురభియున్
మాకొద్దుర చింతామణి
మాకన్నియు నీవె కాదె మహిలోన శివా! ॥ 62 ।

నీ నామ మడఁచు లేమిని
నీ నామము పారద్రోలు నిఖిలాఘములన్
నీ నామమవని జనులను
తానై తరియింపఁజేయు తరణమ్ము శివా! ॥63॥

ఆపదలు కలిగినప్పుడు
నేపుగ సంపదలయందు నీడ్యత నిన్నున్
బ్రాపుగఁ దలతునొ తలవనొ
నీపాలన మరువకయ్య నీవాఁడ శివా! ॥ 64॥

మనసున నిన్నే నిలిపియు
తనువిది నీ సేవలోనఁ దరియింపంగా
ధనమును నీ పూజలలో
ఘనముగ వెచ్చింపఁ జేయు కామారి! శివా! ॥ 65

శివయను రెండక్షరములు
భవతారక మంత్రమగుచు భద్రత గూర్చున్
శివయనునక్షరయుగ్మమె
భువి జనులకునయ్యె కల్పభూజమ్ము శివా! ॥66 ॥

హర హర యని కీర్తించిన
హరియింతువు పాతకముల నాక్షణముననే
హర! నీకు సాటి దైవము
ధరలో మరి కానరారు తథ్యమ్ము శివా! ॥ 67 ॥

పత్తిరిని పూజసేయగ
నత్తరి నీవిత్తువయ్య యణిమాదులనే
మత్తుడనై నీనామము
చిత్తములోఁదలఁచునన్ను ఁ జేకొనుము శివా! ॥ 68

గజముఖ షణ్ముఖ తనయుల
నిజపంచముఖత్వమెంచి నీరసపడకే
త్రిజగద్భూతంబులకును
నిజభోజనమెట్టులిత్తు నిఖిలేశ! శివా! ॥ 69॥

హాలాహల భక్షణమును
ఏలాగున చేసినావొ! ఏమా మర్మం-
బాలాఘవంబు నీకే
హేలాగతిఁ జెల్లెనయ్య హే నాథ! శివా! ॥ 70 ॥

సురలందరు సుధ గ్రోలియు
మరి మరి మరణించుచుంద్రు మరు కల్పములో
గరళము ద్రావియు నీవే
మరణింపక యుందువార! మారారి! శివా! ॥ 71 ॥

హర! హర! శంభో! యనఁగను
హరియింతువు పాతకముల నంతకహన్తా
హరనామ మంత్రజపమే
మరువక నేఁ జేయునట్లు మతినిమ్ము శివా! ॥ 72 ॥

బిట్టరచి నిన్నుఁ బిలువగ.
ఎట్టులనో అమ్మ వచ్చె యెంతటి చోద్యం
బిట్టులనబ్బుర పరచుచుఁ
దట్టుచు వామాంకమిడుము తల్లివిగ శివా! ॥73॥

సుందరము మణిద్వీపము
నందున్నది రత్నగృహము నందలి మంచం
బందున సుందర శివుఁడుగ
నందముగా నమ్మతోడ నగువడుము శివా! ।74॥

నాకీయనశనమడుగను
నాకొద్దుర నీదు భూష నాగాభరణా!
నా కిడుమా నీ పాదము
నాకదె పదివేలు చాలు నందీశ! శివా! ॥ 75 ॥

పాపాంబుధిలో మునిగిన
ఈ పాపినిఁ దేల్పనెంచి యీమాత్రముగా
నీపాద భక్తి నిచ్చితి
నాపాలికినిదియె చాలు నతినిడెద శివా! ॥ 76 ॥

నామది నీదగు పాదము
క్షేమంకరమైనదయ్య చిత్తము తోడన్
నీమంబుగ నీయర్చన
నేమరకను జేయనిమ్మ యిలలోన శివా! ॥ 77

జీతము నాతము గొనకయే
చేతముతో నీదు సేవ సేయుదునెపుడున్
ఆతతమగు నీ సన్నిధి
వేతనమదె పదులు నూర్లు వేలందు శివా! ॥ 78 ॥

నిత్యంబభిషేకంబును
భత్యంబుగ సేయనిమ్ము భవహరణపరా
భృత్యుని కోరిక దీనిని
సత్యమ్మొనరింపుమయ్య సర్వేశ! శివా! ॥ 79 ॥

ఏపూజల సాలీడును
ఆపామును నేన్గునిన్ను నర్చించినవో
ఆపూజ నాకు తెలిపియు
నాపాటిది కరుణచూపు మఘనాశ! శివా! ॥ 80 ॥

ఇష్టము నీకొనరింపగ
కష్టము లేదయ్య నాకుఁ గనగా జన్మం
బిష్టంబైనది చెప్పుము
ఇష్టంబగు నదియె నాకు నీశాన! శివా! ॥ 81 ॥

ఎంతోమందికి బంధము
లంతంబొందించి ముక్తి నందిచ్చితివే
వంతల నావియుఁ గూడను
అంతంబొందించి ముక్తి నందిమ్ము శివా! ॥ 82 ॥

భ్రాంతంబగు చిత్తముతో
భ్రాంతింగడు చెంది నేను భ్రమియింపంగా
శ్రాంతిని బాపఁగ నీవే
శాంతిని నాకీయుమయ్య సర్వేశ! శివా! ॥ 83 ॥

అంతా మిథ్యే యైనను
సుంతైనను జగతి గంటి సుఖమును నీదె
చింతలు బాపెడి చింతన
అంతమునందించునదియె యముములను శివా! ||84||

నీ పాదసేవ నీయగ
నీపాదము బట్టి నేను నిత్యము వేడన్
ఈ పాటి కరుణ లేదా
నాపాలిటి కల్పభూజ! నన్ గనుము శివా! ॥ 85॥

ఎచ్చట నా మది నిలచునొ
యచ్చట నీ రూపు నిలుపు మగజానాథా!
ఎచ్చట నే శిరముంచెద
నచ్చట నీ పాదముంచు మచలేశ! శివా! ॥ 86॥

కామనలు నిండె మనసున
ఆ మనసది తిరుగుచుండె నర్థాతురమై
ఏమని చెప్పను వెతలను
ఆమని నీ చూపు నాకు నందిమ్ము శివా! ॥87 ॥

తనువియ్యది యస్థిరమని
మనమున భావింపకుండ మనుచునె యుంటిన్
తనవానిగ ననుఁ దలచియుఁ
దనయత నను గావుమయ్య! తండ్రీశ! శివా! ॥ 88

నీపాద సేవనీయుము
నాపాలిటికదియె యగును నాకు వాసం
బాపాటి దయను జూపుము
ఈ పాపడు సంతసించునెంతేని శివా! ॥89 ॥

నీదగు పంచను జేరిన
మోదము చేకూరునయ్య ముద్దుగ నన్నున్
నీదగు పుత్రుల సరసన
కాదనకయె జేర్చుకొనుము కాళేశ! శివా! ॥ 90 ॥

ఎన్నాళ్లని నీకోసము
కన్నార్పక జూతునయ్య కరుణాంబునిధీ!
చిన్నారిగ మదినెన్నుచు
నన్నును నీవాదరింపు నగజేశ! శివా! ॥ 91 ॥

నిక్కము చావని తెలిసియు
నక్కజముగ వెజ్జుకొరకు నరిగెదరహహా
నిక్కపు వెజ్జవు నీవను
నిక్కంబిది తెలియలేరు నిఖిలేశ! శివా! ॥ 92 ॥

ఇనసాహస్రిని మించియు
ఘన శోభను దనరుచుండి కనబడవేలా?
అనఘునిగా నను జేసియు
మనమున నీవెలుగు జూపు మహనీయ! శివా! ॥93

హర! హర! పురహర! శంభో!
స్మరహర! ఫాలాక్ష! ఈశ! సర్పాభరణా!
గిరిశాయి! గగనకేశా!
గిరిజేశా! యనుచు నిన్నుఁ గీర్తింతు శివా! ॥ 94 ॥

సినిమాలోవలె పిలువగ
వెనువెంటనె పలుకవేమి విశ్వేశ! విభో!
సినిమా వంటి జీవిత
మనిదలఁచియు బలుకవేమి? యగజేశ! శివా! ॥ 95॥

నిన్నుంగానక గడచిన
వెన్నెన్నో యేండ్లు నాకు నిట్టిట్టె యనన్
కొన్నే మిగిలినవయ్యా
నిన్నునికఁ జూపుమయ్య నిత్యమ్ము శివా! ॥ 96 ।

కాలము గడచుచునున్నది
కాలుండే మరి వైద్యుఁడనగ కనఁబడుచుండెన్
కాలము మూడకమునుపే
కాలాంతక! నీవు నాకు కనఁబడుము శివా! ॥ 97॥

నాదగు వాసము కాశిగ
నాదగు మాటంత నీదు నామంబనఁగా
నాదగు దర్శనమందున
నీదేయగు రూపు నిండనిమ్మోయి శివా! ॥98 ॥

చావన భయమే లేదుర
కావఁగ నీవుండ నాకు గాలాంతకుఁడా
చావన నీలో లయమను
భావన నాకిచ్చితీవె భావింతు శివా! ॥ 99 ॥

పుట్టువులెన్నో గడచెను
పుట్టిన యీ పుట్టువైన పుట్టువు ద్రుంపన్
పట్టగనిమ్మా పాదము
ఒట్టుర నన్నేలకున్న నొరిగెదను శివా! ॥ 100

కాలుని యెదపైఁ దన్నగ
కాలాంతకుఁడనుచు నిన్నుఁ గడుఁ గీర్తింపన్
ఆలీల యమ్మదనుచును
యేలా మరి చెప్పకుంటివీశాన! శివా! ॥101 ॥

భూతంబులైదు నైనవి
నాతనువున సంఖ్యలోన నైదగు చక్రా
లాతరణిచంద్రులక్షులు
ఆతతముగ నీవె ఈశుఁడనియెదను శివా! ॥ 102 ॥

భూతములు సూర్యచంద్రులు
నాతనువున నమరనిట్లు నాథుడవీవే
ఈ తీరున నేఁ బొందెద
నీ తనువుల సామ్యమిలను నీ దయను శివా! ॥103

తనువుండునంత దనుకను
గనుమా రోగంబులేను గనకుండనిలన్
తనువిది శిథిలంబగుచో
గొనుమా నీలోకి నన్ను గురుమూర్తి! శివా! । 104

పలుకుల నుతులుగఁ దలపుము
పలు తిరుగులఁ దలచుమయ్య ప్రొదక్షిణముల్
గోలెడి జలమభిషేకము
తలపుము నా చేతలిట్లు తపమనఁగ శివా! ॥105

సంపదలు కలిగినప్పుడు
ఇంపుగ పదిమంది పొగడ నీడ్యుండనుచున్
పెంపున యౌవనముండగ
సొంపుగ నిను పాడనిమ్ము సోమేశ! శివా! ॥106 ।

వేదంబుల వల్లింపక
పాదములే మరి పట్టలేక పాపాత్ముడనై
మోదంబున మనుచుంటిని
ఈ దాసుని కరుణ జూడుమీశాన! శివా! ॥ 107 ॥

అందమ్మగు కందమ్ముల
నందముగా కూర్చగానె యమరెను నీకీ
నందము శతకంబయ్యెను
దమ్ములు నావి త్రైళ్లై భవముడిగె శివా! ॥108 ।