మధుమతీ స్తబకము

1. దిశి దిశి ప్రసరద్రుచితమోదమనమ్ ।
హరతు మే దురితం హరివధూహసితమ్ ॥

అన్ని దిక్కులందు బ్రసరించు కాంతి గలిగి, యజ్ఞానమును బోగొట్టు ఇంద్రాణీ మందహాసము నా పాపములను హరించుగాక.
2. హరతు దుఃఖభరప్రసృతమశ్రుజలమ్ ।
భరతభూసుదృశో బలజితో రమణీ ॥

దేవేంద్రుని భార్యయైన ఇంద్రాణి భారతభూమియనెడి కాంత యొక్క దుఃఖభారముచే బ్రవహించు కన్నీటిధారలను హరించు గాక.
3. అతితరాం మహితా సురపతేర్వనితా ।
కరుణయా కలితా మమ శచీ శరణమ్ ॥

అత్యంత పూజితురాలు, దేవేంద్రునకు భార్యయై దయతో నిండినది యగు శచీ దేవి నాకు శరణము.
4. త్రిభువనక్షితిరాడ్భువనభూషణభా ।
అఖిలభాసకభా మమ శచీ శరణమ్ ॥

త్రైలో క్యాధిపతియైన ఇంద్రునియొక్క భవనమగు అమరావతి నలంకరింపజేయు కాంతిగలది, నిఖలమునకు తేజస్సునిచ్చు కాంతిగలది యగు శచీదేవి నాకు శరణము.
5. సతతయుక్తసుధీహృదయదీపకభా ।
నిఖిలపాచకభా మమ శచీ శరణమ్ ॥

నిత్యము యోగయుక్తులై యుండు పండితుల హృదయములకు జ్యోతియగుచు, నిఖలమును పచన మొనరు శచీదేవి నాకుశరణము.
6. రవివిరోచకభా శశివిరాజకభా ।
భగణశోభకభా మమ శచీ శరణమ్ ॥

సూర్యుని ప్రకాశింప జేయు రోచిస్సులుగలది,విరాజమాన కాంతిగలది, చంద్రునియందు నక్షత్రములయందు శోభనిచ్చు కాంతిగలది యైన శచీదేవి నాకు శరణము.
7. గగనఖేలకభా సకలచాలకభా ।
అభయదాఽతిశుభా మమ శచీ శరణమ్ ॥

గగనమందు క్రీడించు కాంతి, సకలమును చలింపజేయు కాంతి, అమృతమునిచ్చు కాంతిగల శచీదేవి నాకు శరణము.
8. రుచిలవఙ్గతయా యదనఘాంశునిధేః ।
హృతతమోభవనం భవతి దీపికయా ॥

పాపరహీతకిరణములకు నిధియగు నేదేవి తన కాంతి లేశము చే గల్పించిన దీపమువల్ల గృహమునందలి (అనగా విద్యుద్దీపము) చీకటిని నశింపఁ జేయుచున్న దో,
9. స్ఫురతి చారు యతః కిరణమేకమితా ।
జలదసౌధతలే ముహురియం చపలా ॥

ఏ దేవియొక్క కాంతినుండి యొక్క కిరణమును బొందిన మెఱుపు యీ మేఘమ నెడి సౌధతలమందు మాటిమాటికి సొగసును స్ఫురింప జేయుచున్న దో,
10. భవతి యద్ద్యుతితః కమపి భాగమితః ।
పవిరరాతిహరః ప్రహరణేశపదమ్ ॥

ఏ దేవియొక్క కాంతినుండి స్వల్ప భాగమును బొందిన వజ్రము శత్రునాశన మొనర్చు నాయుధములలో మేటిపదము బొందు చున్నదో,
11. భవతి యత్సురుచేరణుతమాంశమితా ।
యువమనోమదనీ సువదనాస్మితభా ॥

ఏ దేవియొక్క కాంతిలోని యణుకమాంశనుబొంది, స్త్రీల యొక్క నగవు కాంతి యువకుల మనస్సుల మదింపఁ జేయు చున్నదో,
12. వితతసూక్ష్మతనుర్మహతి సా గగనే ।
పరమపూరుషభా మమ శచీ శరణమ్ ॥

గొప్పదైన ఆకాశమందు వ్యాపించిన సూక్ష్మ దేహముగలది, పరమపురుషుని బ్రకాశింపజేయు చిద్రూపిణియునగు ఆ శచీ దేవి నాకు శరణము.
13. అమరనాథసఖీ రుచినిధానముఖీ ।
అమృతవర్షకదృఙ్ మమ శచీ శరణమ్ ॥

ఇంద్రసఖయు, కాంతులకు నిధియైన ముఖము గలదియు,అమృతమును వర్షింపజేయు చూపులుగలదియైన శచీదేవి నాకు శరణము.
14. అవిధవా సతతం యువతిరేవ సదా ।
అనఘవీరసుతా మమ శచీ శరణమ్ ॥

నిత్య సువాసిని, సదాయౌవనముగలది, పాపరహితులైన వీరులు పుత్రులుగా గలదియైన శచీదేవి నాకు శరణము.
15. అమృతవత్యధరే సురధరాపతయే ।
చరణయోర్భజతే మమ శచీ శరణమ్ ॥

ఇంద్రుని కొఱ కధరమునందును, భక్తునికొఱకు పాదములందు నమృతమును ధరించిన శచీదేవి నాకు శరణము.
16. స్మితలవేషు సితా శిరసిజేష్వసితా ।
చరణయోరరుణా బహిరపి త్రిగుణా ॥

మందహాసమందు తెల్లగాను, కేశములందు నల్లగాను, పాదములం దెఱగా'ను బాహ్యమందుగూడ నిట్లు త్రిగుణ యగుచున్నది.
17. కపటచన్ద్రముఖీ ప్రకృతిరిన్ద్రసఖీ ।
మృతిజరారహితా మమ శచీ శరణమ్ ॥

చంద్రముఖయును, ఇంద్రసఖయు, జనన మరణములు లేని మూలప్రకృతియు నగు శచీ దేవి నాకు శరణము.
18. కృశతమేప్యుదరే త్రిభువనం దధతీ ।
జనిమతాం జననీ మమ శచీ శరణమ్ ॥

మిక్కిలి చిన్న ఉదరమందైనను త్రిభువనములను ధరించుచు జీవకోటికి తల్లియగు శచీదేవి నాకు శరణము.
19. స్థిరతరా మనసి స్థిరతమా వచసి ।
నయనయోస్తరలా మమ శచీ శరణమ్ ॥

మనస్సునం దతి స్థిరమైనది, వాక్కునం దత్యంత స్థిర మైనది, నేత్రములందు మాత్రము చాంచల్యము గలదియైన శచీ దేవినాకు శరణము.
20. మృదుతరా కరయోర్మృదుతమా వచసి ।
భుజబలే కఠినా మమ శచీ శరణమ్ ॥

అతి మృదుకరములు, అత్యంత మృదు వాక్కులు, కఠిన కుచములు గల శచీదేవి నాకు శరణము.
21. మృదులబాహులతాఽప్యమితభీమబలా ।
అసురదర్పహరీ మమ శచీ శరణమ్ ॥

మృదుహ స్తములైనను, నమిత బలపరాక్రమములు గలిగి యసురుల గర్వము నణచిన శచీదేవి నాకు శరణము.
22. అబలయాఽపి యయా న సదృశోఽస్తి బలే ।
జగతి కశ్చిదసౌ మమ శచీ శరణమ్ ॥

అబలయైనను, బలమున కేదేవి కీ జగత్తులో నెవ్వడు సాటి కాడో. అట్టి శచీ దేవి నాకు శరణము.
23. అతితరాం సదయా పదరతే మనుజే ।
ఖలజనే పరుషా మమ శచీ శరణమ్ ॥

తన పాదములం దాసక్తిగల మనుజులయందతి దయగలది, దుర్మార్గుల కతి కఠినురాలు నగు శచీదేవి నాకు శరణము.
24. గణపతిం కురుతాద్భరతభూమ్యవనే ।
అమరభూమిపతేః ప్రియతమా సబలమ్ ॥

ఓ తల్లీ ! నాకు భారత భూమిని రక్షించుటకు మిగుల సమర్ధ మైన బుద్ధి నిమ్ము.
25. మధురశబ్దతతీర్మధుమతీరజరా ।
గణపతేశ్శ‍ృణుయాత్సురపతేస్తరుణీ ॥

ముసలితనము లేని యింద్రాణి మధురశబ్ధములతో కూర్చబడిన గణపతి సంబంధమగు నీ మధుమతీ వృత్తములను వినుగాక.