భద్రాద్రిరామ శతకం

ముందు వెనకయ్య కొలచియు అందమైన
  	శతకమొక్కటి తలపెట్టి చక్కనైన
పాదమును మది(నీది)తలుపగా పాదమమరె
 	భద్రగిరిధామ! కరుణాసముద్ర రామ !! (1) 

తాత్పర్యము:

ఓ భద్రగిరిధామ!  కరుణాసముద్ర రామ!
ముందుగా విఘ్నేశ్వరుని ఆరాధించి, ఈ శతక ఆరంభ సమయములో నీ చక్కనైన పాదములను మనసులో ధ్యానింపగా, నీ పాదముల వంటి చక్కనైన శతక మకుటము స్ఫురింపచేసావు|
రామపఞ్చాక్షరి జయశ్రీరామకోటి
భక్తి తో వ్రాయ మాకిల భద్రమూర్తి!
ఇహ పరమ్ముల ముక్తి మాకిచ్చెదవుగా
భద్రగిరిధామ! కరుణాసముద్ర రామ! 2
నామ లేఖన రామాయణాఖ్య యజ్ఞములను
చేయంగ శక్తిని మూలమంత్ర జపము
సలుపగ బుద్ధినోజంబునిమ్ము
భద్రగిరి ధామ! కరుణా సముద్ర రామ !! 3
జన్నమెట్లుగ సేతునో జానకీశ !
అంగబలము నర్ధబలిమి యనగ నండ
నీవు నీబంటు మారుతి నిల్వుడయ్య
భద్రగిరి ధామ! కరుణా సముద్ర రామ! 4
రామ! రామాయణ హవన రక్షకునిగ
స్వామి! సామీరి బంపుము సాయపడును
జన్నమిదిసాగు జేజేలు జనులు పలుక
భద్రగిరి ధామ! కరుణా సముద్ర రామ!  5
సామి సామీరి నాకిల సఖునిజేయ
భయము నాకేల లీలగా భవముదాటి
నిన్ను జేరెద నిశ్చింత నిక్కమిదయ
భద్రగిరి ధామ! కరుణా సముద్ర రామ!  6
యజ్ఞప్రసాదముగనీయ నందరకును
శతకమిట్లుగ వ్రాయగా శాంతమతిని
నాథ ! మొదలిడ సాంతము నడుపుమయ్య
భద్రగిరి ధామ! కరుణా సముద్ర రామ!  7
ఆంజనేయుడు నాకుండ యండగాను
విఘ్నభయమేల నాకగు విబుధవినుత
ఘనతరంబుగ జన్నము గడుప గలను
భద్రగిరి ధామ! కరుణా సముద్ర రామ!  8
నామరంజిత కావ్యము నవ్య ఫణితి
సాగిపోవును సామీరి సాహచర్య
మహిమ ననవద్య పద్యాల మాలికగుచు
భద్రగిరి ధామ! కరుణా సముద్ర రామ! 9
పదము పట్టలేదు పూజల పదపడి
చేయలేదు సంకీర్తన జేయగ మది
నెన్నడు తలంపలేదు నన్నెట్లు గనెదొ
భద్రగిరి ధామ! కరుణా సముద్ర రామ! 10
`రామ ! నీవాడననగానె రయము నతని
గాతు నెవడైన` యని నావుగాదె నీవు
`నేను నీవాడ` ననుచుంటి నీవె శరణు
భద్రగిరి ధామ! కరుణా సముద్ర రామ! 11
తోలుబొమ్మగ జేసియు తూర్ణగతిని
ఆటలాడింప సొక్కితి నలసి పోతి
ఆపుమికనైన నీయాట నార్తిహరుడ
భద్రగిరి ధామ! కరుణా సముద్ర రామ! 12
మరణ మృదంగ నాదము మారుమ్రోగ
కాలమది తీర కాలుడు పాశమేయ
నెదురు జూచెద నీరాకకే నభీతి
భద్రగిరి ధామ! కరుణా సముద్ర రామ! 13
ఏమి రాసెనో విధాత! యేమిశిక్ష 
వేయునో మరి కాలుడు యేమి యగునో 
యనెడి చింత లేదుర నీవె యండ నాకు 
భద్రగిరి ధామ! కరుణా సముద్ర రామ! 14

15-19 20-24 25-29 30-34 35-39 40-44 45-49 50-54 55-59 50-54 55-59 60-64 65-69 70-74 75-79 80-84 85-89 90-93 94-97

98-100 asthapadi