పంచాక్షరీ పద్యపంచకము

ఓంకారము నీ రూపము
హ్రీంకారము నీదు శక్తి హ్రీంబీజముతో
ఓంకారముచ్చరింపగ
ఓంకారము మిగుల శక్తియుత మౌను శివా! ॥ 01
నగజాపతి నాతండ్రన
నగజాతనయుండె యన్న నగజే యమ్మౌ
నగములకధిపతి మేరువు
నగమై నాయింట నిలచు నగశాయి! శివా! ॥ 02॥

మనసున నమకము చమకము
తనువందు విభూతిపూత తనరారంగా
ఘనతర రుద్రాక్షలనే
ననవరతముఁ దాల్చునట్లు ననుఁజూడు శివా! ॥ 03

శిరమున దోషాకరునే
మరి భూషగ దాల్చినావు మన్నన తోడన్
కరుణావరుణాలయ! నీ
కరుణను నాయెడనుఁగూడఁగనఁ బరచు శివా! ॥04॥

వామాంగంబున భామను
సీమలనే మీరునట్టి చీరల తోడన్
వ్యోమావృత కేశంబుల
భూమంబగు రూపుఁజూపు భూతేశ! శివా! ॥ 05॥

యమునిన్ దన్నిన నిన్నును
యమనియమములాచరించి యర్చింపంగా
యముఁడేమి చేయగలఁడిల
యమపాశాభీతినిమ్ము యమయముడ! శివా! ॥ 06