ఆంతరదర్శనము

ఆంతర దర్శనమీయగ
స్వాంతము సంతర్పితమ్ము సంతుష్టమగున్
అంతరమపుడే తొలగును
అంతిమ కాంక్షితముఁ దాని నందిమ్ము శివా! ।॥33

మూలాధారమునందున
బాలుని గణపతినిఁగొల్వ పాపములుడుగన్
లీలావతి భైరవి తా
కేలంగొని నాకు నిమ్ము కేలూత శివా! ॥34 ॥

స్వాధిష్ఠమగ్ని చక్రము
శోధించియు ప్రజ్వలింప శూలిని నిన్నున్
బాధింపనీక యంబిక
సౌధంబగువృష్టిఁ గాచు సుందరిగ శివా! ॥॥35 ॥

జలచక్రము మణిపూరము
జలదునిగా నాక్రమింప జాలిన నీతో
చలమగు విద్యుల్లతగా
తలపగఁ గన్పట్టునమ్మ తనరారి శివా! ॥36 ॥

హంసల నే బంధింపగ
హంసలకాధారమైన యానాహతమున్
హంసల మిథునము రూపున
హంసనుగా నన్ను జేయ నలరారు శివా! ॥ 37

నాకంఠపద్మమందున
నాకాశపు తత్త్వమరసి యా మీ కవనే
నా కన్నుఁగవకుఁ జూపుము
లోకము నే మరతునయ్య లోకేశ! శివా! ॥38॥

భ్రూమధ్యమందు నాజ్ఞను
సేమంబుగఁ జూపుమయ్య చిత్కళనిపుడే
భూమానందము నందెద
ఈ మాత్రపు కృపనుఁ జూపుమీశాన శివా! ॥ 39।

తలపూవు నందు నిలువుము
తలఁదలపులవెల పోయి తనరెద నేనే
ఫలముగ పండిన జీవన
వలమిది నాకీయుమయ్య పాలాక్ష! శివా! ॥ 40 ॥