పంచలింగార్చన

రామేశ్వరమది మేనున
నా మూలాధారమయ్యె నందున నీవే
రామేశ్వర! భూమ్యంశను
రామార్చిత! నిలువుమయ్య రాజిల్లి శివా! ॥ 28 ॥

జంబూకేశ్వరలింగము
నంబుజమణిపూరమందు నస్తత్వముతో
నంబకము లోనఁదెరచియు
నంబాపతి! చూపుమయ్య అద్భుతము శివా! ॥29 ॥

అరుణాచలమాగ్నేయము
సరితూగగ దానికగును స్వాధిష్ఠానాం
బురుహము, వహ్ని తనువుగ

కరుణను నద్దాన నిలుపు కామేశ! శివా! ॥ 30 ॥

శ్రీకాళహస్తి యందుఁబి
నాకధరా! మారుతంబనాహతసంజ్ఞన్
నీకోసమమరియున్నది
నీ కాంతనుఁ గూడి యచట నిండారు శివా! ॥31॥

ముదమున నిన్నే తలఁచెద
చిదంబరేశ! గగనసర సిజమధ్యమునన్
పదముంచి నన్నుఁ గావగ
యెదఁజేరగ రాగదయ్య యేమరక! శివా! ॥ 32 ।